|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 08:05 PM
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ - 2026 వేదికగా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా మరో రెండు భారీ విజయాలను సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జరిపిన చర్చలు సఫలమై.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు క్యూ కట్టాయి. అటు గ్లామర్ రంగంలో దిగ్గజమైన 'లోరియల్', ఇటు క్లీన్ ఎనర్జీ రంగంలో 'న్యూక్లర్ ప్రొడక్ట్స్' సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.
ప్రపంచ ప్రసిద్ధ సౌందర్య సాధనాల సంస్థ లోరియల్ ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యూటీ-టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, లోరియల్ సీఈవో నికోలస్ హియెరోనిమస్ మధ్య జరిగిన భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లోనే ఈ అత్యాధునిక కేంద్రం ప్రారంభం కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో ఇక్కడ రూపొందించే సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందించనున్నారు. తద్వారా హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మరో మెట్టు ఎక్కింది.
క్లీన్ ఎనర్జీలో సరికొత్త విప్లవం..
పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ సుమారు 6 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్రంలో నిర్మించేందుకు ఆసక్తి చూపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 'ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్' సమర్పించింది. 2047 నాటికి నెట్-జీరో లక్ష్యాన్ని సాధించాలన్న తెలంగాణ సంకల్పానికి ఈ 300 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్ వెన్నెముకగా నిలవనుంది.
ఈ చర్చల్లో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను తమ కేంద్రంగా మార్చుకున్నాయని, ఇప్పుడు బ్యూటీ-టెక్, గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్న విభాగాలు కూడా తోడవ్వడం శుభపరిణామమని అన్నారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ద్వారా మరిన్ని అవకాశాలను లోరియల్ ప్రతినిధులకు వివరించారు. కేవలం సర్వీస్ రంగమే కాకుండా, భవిష్యత్తులో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసేందుకు లోరియల్ సానుకూలత వ్యక్తం చేయడం విశేషం.