|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 08:18 PM
తెలంగాణలో వీధికుక్కల సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది. ప్రభుత్వం సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంతో అటు ప్రజలు, ఇటు మూగజీవాలు బలైపోతున్నాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఎన్నికల హామీలో భాగంగా వాటిని కిరాతకంగా చంపేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కొన్ని వందల వీధి కుక్కలను హతమార్చగా.. ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా హైదరాబాద్‌కు సమీపంలోని రంగారెడ్డి జిల్లా యాచారంలో సుమారు 100 కుక్కలకు విషం పెట్టి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుషానికి పాల్పడిన సర్పంచ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల సమయంలో.. వీధికుక్కల బెడదను శాశ్వతంగా తొలగిస్తామని పలు గ్రామాల అభ్యర్థులు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక శాస్త్రీయ పద్ధతులకు బదులుగా, అడ్డదారిన కుక్కలను అంతం చేసే మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యాచారంలో సుమారు 100 కుక్కలను విషపు ఇంజెక్షన్లు, విషాహారం ఇచ్చి చంపి గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టినట్లు తెలుస్తోంది. 'స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా' ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఒక్క యాచారం మాత్రమే కాదు.. గతంలో హన్మకొండ జిల్లాలోని రెండు గ్రామాల్లో 120 కుక్కల కళేబరాలను వెలికితీశారు. కామారెడ్డి జిల్లాలోనూ మరో 100 కుక్కలు ఇలాగే బలైపోయాయి. క్షేత్రస్థాయిలో యంత్రాంగం విఫలం కావడంతో గ్రామాల్లో ఇలాంటి క్రూరమైన చర్యలు పెరుగుతున్నాయి. నిందితులపై భారతీయ న్యాయ సంహిత, జంతు హింస నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
నిజానికి, వీధికుక్కల సంఖ్యను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ (కుక్కల పునరుత్పత్తి నియంత్రణ), వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలి. కానీ గత రెండేళ్లుగా జిల్లా కలెక్టర్లకు, అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు కరిచినప్పుడు తీవ్ర పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించినప్పటికీ.. యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం.
మరోవైపు, దేశంలో పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల అమలులో విఫలమైన రాష్ట్రాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని బెంచ్ హెచ్చరించింది. అలాగే వీధికుక్కలకు ఆహారం పెట్టే వారిపై కూడా బాధ్యతను, జవాబుదారీతనాన్ని నిర్ణయిస్తామని కోర్టు పేర్కొంది. జంతు ప్రేమికులు, ప్రభుత్వం మధ్య సమన్వయం లేకపోవడంతో సామాన్యులు ప్రాణాలు కోల్పోతుంటే, మూగజీవాలు దారుణ హత్యలకు గురవుతున్నాయి.