|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 04:03 PM
పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు అన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణలో హైడ్రా చొరవను కొనియాడారు. మరీ ముఖ్యంగా నగరంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా ఎంతో కృషి చేస్తోందన్నారు. చెరువుతో పాటు.. ఆ పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. వరద నివారణతో పాటు.. పర్యావరణ పరిరక్షణకు, జీవవైవిధ్యానికి, భూగర్భ జలాల పరిరక్షణకు చెరువుల ప్రాధాన్యతను గుర్తించే వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఉప్పల్‌లోని ఎస్ ఎన్ డీ పీ ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవానికి మంగళవారం వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు గారు ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ లక్ష్మారెడ్డితో పాటు.. ఎమ్మెల్సీ శ్రీ పి. మహేందర్ రెడ్డితో కలిసి ఐటీ మంత్రి ఉప్పల్ నల్లచెరువును సందర్శించారు. ఈ సందర్భంగా చెరువును ఎలా అభివృద్ధి చేస్తున్నారు.. ఏలా తీర్చిదిద్దుతున్నారు అనే విషయాలను అక్కడ చెరువు పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థ యజమాని మహమ్మద్ యూనస్‌ను అడిగి తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధి పనులకు సంబంధించిన 3డీ నమూనాలను మంత్రి పరిశీలించారు.