|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 12:15 PM
మిగ్‌జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున.. జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రెండురోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.‘‘భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలి. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా ముందుజాగ్రత చర్యలు తీసుకోవాలి. నీటిపారుదల శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రతలు తీసుకోవాలి. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలి’’ అని సీఎస్ ఆదేశించారు.