by Suryaa Desk | Sat, Jul 13, 2024, 07:58 PM
తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి.. ఎలాంటి పెండింగులు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్స్ వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో నిర్వహించిన "క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్సు"లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో తొలిసారి ఫీజు రీయింబర్స్మెంట్ విధానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే.. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకుండా.. చాలా వరకు పెండింగ్ పెట్టిందని.. తద్వారా కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపారు. అయితే.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తు్న్నట్టు చెప్పుకొచ్చారు. ఇక బకాయిలను కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేలా.. మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ విషయంపై ఆర్థిక శాఖతో మాట్లాడి.. ఓ కొలిక్కి తీసుకొచ్చేలా చూడాలని శ్రీధర్ బాబుకు విన్నవించారు.
ఇక.. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా ల్యాండ్ మార్క్‌గా ఉన్న ప్రదేశాలన్ని ఇంజనీర్ల గొప్పతనాన్ని నిదర్శనాలేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాంటి ఇంజనీర్లను తయారు చేస్తున్న కాలేజీలకు సహయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా కళాశాలలు ఉండకూడదని అభిప్రాయ పడ్డారు. ప్రతి ఏటా బటయటకు వస్తున్న ఇంజనీర్లు నిరుద్యోగులుగా కాకుండా.. ఉపాధి పొందే నిపుణులుగా తయారు చేసే బాధ్యత.. కళాశాలలపైనే ఉందని వివరించారు.
అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైందని సివిల్ ఇంజనీరింగ్ అని.. అలాంటింది కొన్ని కళాశాలల్లో సివిల్ ఇంజనీరింగ్ లేకుండా చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో కచ్చితంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను నడపాలని సూచించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ మూడు కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంజనీరింగ్ కళాశాలలు ఉద్యోగాలు సృష్టించే సంస్థలుగా కాకుండా మేధావులను అందించే సంస్థలు ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. గత ముఖ్యమంత్రులు తీసుకున్న విధానాల వల్ల మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందు ఉన్నామని వ్యాఖ్యానించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీల్లో కోర్సులు ఉండాలని, ఫార్మా, ఐటీ, ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాల్లో ఏఐకి సంబంధించిన కోర్సు కూడా ప్రవేశపెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఏఐకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెడితే సర్కారు నుంచి ప్రోత్సాహకం అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.