by Suryaa Desk | Sun, Aug 11, 2024, 08:05 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో అమర రాజా బ్యాటరీ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్లాంట్ విషయంపై అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఛైర్మన్ గల్లా జయదేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బ్యాటరీ ప్లాంట్ కోసం ఇచ్చిన హామీలను ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం నెరవేర్చకపోతే తమ ప్లాంట్ కోసం వేరే చోటు చూసుకుంటామంటూ శనివారం కీలక కామెంట్స్ చేశారు.
దీంతో అమరరాజా సంస్థ తెలంగాణను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రాన్ని వీడతామంటూ అమరరాజా సంస్థ ప్రకటించటం బాధాకరమన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దన్నారు. బ్రాండ్ తెలంగాణ ఇమేజ్‌కు నష్టం రాకుండా రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని సూచించారు.
'తెలంగాణ ప్రభుత్వం మాకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమరరాజా సంస్థ చెబుతున్నట్లు వార్తలు చూస్తున్నాం. అదే నిజమైతే చాలా దురదృష్టకరం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరేంటో అర్థంకాక చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడుతున్నాయి. కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోయింది. కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించింది. ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతానని చెబుతుంటే, ఇది తెలంగాణ బ్రాండ్‌కు తీవ్ర నష్టం చేస్తుంది.
రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంతమాత్రం మంచిది కాదు. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసాగించాలి. అమరరాజా సంస్థ తెలంగాణలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా వాళ్లను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డాం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందని ఆశిస్తున్నా.
నిజానికి, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో రెవెన్యూ సర్‌ప్లస్ స్టేట్‌గా ఉంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, దివాళా తీసిందంటూ ఎయిడ్స్, క్యాన్సర్ పేషెంట్ అని ప్రచారం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేసే ఇలాంటి ప్రకటనలు సీఎం గారు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలి. వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాలి. లేదంటే మరిన్ని సంస్థలు రాష్ట్రాన్ని వదిలే పరిస్థితి వస్తుంది.' అని కేటీఆర్ వెల్లడించారు.