![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 03:27 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పక్కనపెట్టి, నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడం ద్వారా తెలంగాణలో పంటలను ఎండబెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు రెండు పంటలు పండించుకోవడానికి నీళ్లు ఇచ్చామని అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కరవును తెచ్చిందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమవుతోందని ఆయన విమర్శించారు. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్ కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనలో ఎండాకాలంలోనూ చెరువులు నిండుగా కనిపించాయని, నేడు అదే చెరువులు నీళ్లు లేక వెలవెలపోతున్నాయని అన్నారు.బీఆర్ఎస్ హయాంలో సమయానికి రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీళ్లు, విత్తనాలు, ఎరువులు, పంట కొనుగోళ్లతో రైతు సంతోషంగా ఉన్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా రైతు భరోసా రాక, సాగునీరు ఇవ్వక, విత్తనాలు, ఎరువులు ఇవ్వక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలపై కక్ష కట్టారని ఆరోపించారు.