![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 03:35 PM
కొద్ది రోజులుగా వ్యాపారులు సిండికేటై పసుపు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు.. తమను దోపిడీ చేస్తున్నారని, అధికారులు స్పందించి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద, ఆ తర్వాత బస్టాండ్ ఎదుట రహదారిపై బైఠాయించి, ధర్నా చేశారు. మార్కెట్‌కు సోమవారం జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున పసుపును తీసుకొచ్చారు. మధ్యాహ్నం వరకు వ్యాపారులతో పాటు అధికారులు కూడా కొనుగోలు చేపట్టలేదు. రైతులు ఈ విషయమై మార్కెట్ అధికారులకు ఫిర్యాదు చేశారు.అయినా వ్యాపారులు తేమ ఎక్కువగా ఉందని కొనుగోలు చేపట్టలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ధర్నా చేయగా.. అక్కడ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో పెద్దసంఖ్యలో బస్టాండ్ వద్దకు తరలొచ్చి ధర్నా చేశారు. బస్టాండ్ నుంచి బస్సులను బయటకు రాకుండా నిలిపివేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గతేడాది మాదిరిగా క్వింటాలుకు రూ.15వేల వరకు ధర పెట్టి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తాను మార్కెట్‌కు వస్తానని, కొనుగోలు జరిగే విధంగా చూస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం రాత్రి వ్యాపారులు, రైతులతో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ సమావేశమయ్యారు. కొమ్ము రకానికి క్వింటాలుకు రూ.9500కు, మండ రకానికి రూ.8వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి కొనుగోళ్లను మొదలు పెడతామని మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు.