|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 07:52 PM
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, దామరగిద్ద గ్రామంలో సోమవారం (ఏప్రిల్ 14న) రోజు తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారులో ఇరుక్కుపోయి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు ప్రాణాలు వదిలారు. బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు గానూ అక్కాచెల్లెల్లు తమ పిల్లలను తీసుకుని అమ్మగారింటికి వచ్చారు. ఇదే సమయంలో ఇంటి ముందు కారు ఆపి ఉండగా.. ఆ అక్కాచెల్లెల్ల పిల్లలైన తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4).. ఆడుకుంటూ వెళ్లి అందులో ఎక్కారు. అయితే.. కారు డోర్లు వేసుకోవటంతో అటోమెటిక్‌గా లాక్ అయిపోయిన విషయం ఆ చిన్నారులకేం తెలుసు.. ఆటలో మునిగిపోయారు. కాసేపటివరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఊపిరాడక ఆ చిన్నారులు తల్లడిల్లిపోయారు. పైనుంచి ఎండ విపరీతంగా కొడుతుండటంతో.. చిన్నారులు కాసేపటికే స్పృహ కోల్పోయారు.
అయితే.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిస్తే ఇక ఆటలో మునిగిపోతారని అనుకుని వారి తల్లులైన అక్కాచెల్లెల్లు కూడా తల్లిగారింట్లో ముచ్చట్లలో మునిగిపోయారు. సుమారు అరగంట కావొస్తున్న ఇంట్లో పిల్లలు కనిపించకపోవటంతో.. ఎండలో ఆడుతున్నారా ఏంటీ అని బయటికొచ్చి చూస్తే ఎక్కడా కనిపించలేదు. ఎటు వెళ్లారా అని చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఈ క్రమంలో కారులో చూడగా.. ఆ ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే కారు డోర్లు తీసి.. పిల్లలును హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అప్పటికే ఇద్దరి ఊపిరి ఆగిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు. ఎండవేడికి చిన్నారుల లేలేత చర్మం బొబ్బలెక్కిపోయింది.
ఈ హృదయ విదారక ఘటనతో ఆ కుటుంబంలోనే కాదు.. దామరగిద్ద గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డోర్లు ఎలా లాక్ అయ్యాయి, ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని నింపింది. వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన అక్కాచెల్లెల్లు తల్లిగారింటికి వచ్చి కాసేపు సంతోషంగా గడపుదామనుకుంటే.. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితంలో తీరని విషాదం చోటుచేసుకోవటం అందరినీ కలచివేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనే ఏపీలో జరిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. తమిళనాడులోనూ ఇలాంటి ఘటనే జరిగి ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.