|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 08:25 PM
హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన హైదరాబాద్‌కు చెందిన ఓ అధికారిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని మురికివాడలను కూల్చివేయవద్దని 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సదరు అధికారి ఉల్లంఘించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ ఘటనకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో జైలులో ఉన్న సదరు అధికారి, తనకు ఉపశమనం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.మంగళవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ తీవ్ర స్వరంతో స్పందించారు. "కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడానికి ఏకంగా 80 మంది పోలీసులను తీసుకువెళతారా మీరు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను ధిక్కరించారా అని అధికారిని ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు అమల్లో ఉండగా మురికివాడలను ఎలా కూల్చివేశారని నిలదీసింది."హైకోర్టు గౌరవాన్ని ఎవరైనా కించపరిస్తే అలాంటి వారిని తక్షణమే అరెస్టు చేస్తాం. ఆయన హైకోర్టు కంటే గొప్పవారని భావిస్తున్నారా చట్టాన్ని గౌరవించని వారికి ఎలాంటి రాయితీ ఉండదు" అని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.అధికారి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, కుటుంబ బాధ్యతలు ఉన్నాయని, 48 గంటలకు మించి జైలులో ఉంటే ఉద్యోగం కోల్పోతారని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం మరింత ఘాటుగా స్పందించింది. "మరి ఆయన కూల్చివేసిన ఇళ్లలోని పిల్లల గురించి ఆలోచించారా ఆ పిల్లల సంగతేంటి 2013 నాటి హైకోర్టు ఆదేశాలను ధిక్కరించేంత ధైర్యం ఆయనకు ఎక్కడిది?" అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.ప్రస్తుతం సదరు అధికారి రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ డైరెక్టర్‌గా ఉన్నారని న్యాయవాది ప్రస్తావించగా, "అంటే ఇప్పుడు వీఐపీలకు స్వాగతం పలకడం, మురికివాడలను కూల్చివేసి రోడ్లు క్లియర్ చేయడం ఆయన పనా ఆయన జైలులోనే ఉండి ప్రభుత్వ ఆతిథ్యం స్వీకరించాలి. లేదంటే ఆయన కూల్చివేసిన ఇళ్ల యజమానులకు భారీగా నష్టపరిహారం చెల్లించాలని మేం ఆదేశించగలం, లేదా ఆయన్ను మళ్లీ తహసీల్దార్‌గా డిమోట్ చేయగలం" అని జస్టిస్ గవాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అయితే, ఈ ఘాటు వ్యాఖ్యల అనంతరం, అధికారి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.