|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 08:39 PM
సమాజంలో ఉన్న పేద, మధ్యతరగతి వారు అలానే మహిళలు, యువతులు, నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకువస్తున్నాయి. వీటిల్లో కొన్ని స్కీముల్లో అయితే భారీగా నగదును ఇచ్చి.. ఆపై డిస్కౌంట్ కూడా ఇస్తుంటాయి ప్రభుత్వాలు. అయితే ఆయా పథకాల గురించి సరైన ప్రచారం లేక, కచ్చితమైన సమాచారం తెలియక చాలా మంది వాటిని ఉపయోగించుకోలేక నష్టపోతున్నారు. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకం కింద ప్రభుత్వం అర్హులైన వారికి రూ.కోటి వరకు లోన్ ఇస్తుంది. అంతేకాక 50 శాతం రాయితీ కూడా అందిస్తుంది. అయితే చాలా మందికి ఈ పథకం గురించి పూర్తిగా తెలియదు. ఇంతకు ఈ పథకం ఏంటిది.. ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలు..
జీవాల పెంపకం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా రుణాలను అందిస్తోంది. ఎందుకంటే.. దేశంలో రోజు రోజుకు మాంసం వినియోగం పెరుగుతోంది. అయితే డిమాండ్‌కు సరిపడా మాంసం ఉత్పత్తి లేదు. దాంతో మాంసం ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జీవాలపెంపు కోసం రుణాలు మంజూరు చేస్తుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం) పథకం కింద కేంద్ర ప్రభుత్వం.. సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేస్తోంది.
దీని ద్వారా గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, నాటుకోళ్లు, పందులు, పుంజుల పెంపకంతో పాటుగా పశుగ్రాసం, దాన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 2021-22లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ స్కీమ్ గురించి చాలామందికి పెద్దగా తెలియదు.. పైగా సరైన అవగాహన లేకపోవడంతో రుణాలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.దాంతో ఎంతో ప్రయోజనం కలిగి ఉన్న పథకం నిరూపయోగం అవుతోంది.
యూనిట్ కు 50 శాతం సబ్సిడీ
ఎన్ఎల్ఎం పథకం కింద.. అర్హులైన వారికి రూ.15 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలు ఇస్తున్నారు అధికారులు. సెలెక్ట్ చేసుకున్న యూనిట్ ఆధారంగా ఈ రుణం మొత్తంలో సుమారు 50 శాతం సబ్సిడీ లభిస్తోంది. ఆసక్తి కలిగిన లబ్ధిదారులు www.nlm.udyamimtra.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి ఫొటో, అడ్రస్, ఆధార్ కార్డు, బ్యాంకు స్టేట్మెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
చాలా కాలంగా ఈ పథకం నిరూపయోగంగా ఉండటంతో.. తాజాగా అధికారులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎల్ఎం స్కీంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. పశుసంతతిపై మార్కెట్లో దుష్ప్రచారం పెరిగిపోవడం వల్ల లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో ఈ పథకం మీద ఆసక్తి చూపడం లేదు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి చైతన్య పరుస్తున్నాం. ప్రతి యూనిట్ మీద అభ్యర్థులకు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ స్కీంని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.