|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 12:17 PM
ఆడపిల్లలు, మహిళల రక్షణకు ఎన్ని చట్టాలొచ్చినా, ఎన్ని కఠిన శిక్షలు విధించినా కామాంధులు, పోకిరీల ఆలోచనల్లో మార్పు రావట్లేదు. ఆడది కనిపించడమే పాపం..అల్లరి చేస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు కామాంధులు భర్త కళ్లెదుటే భర్యను వేధించారు. నోటికొచ్చిన అసభ్యకర మాటలతో రెచ్చిపోయారు. కాసేపు నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో హంగామా చేసి.. బెదిరించారు.బాధిత వివాహిత తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి గతరాత్రి బేగంపేటలోని ఒక పబ్ కి వెళ్లి 11.30 గంటలకు తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. ఎస్సార్ నగర్ మెట్రో (SR Nagar Metro) స్టేషన్ వద్ద భర్తపై ముగ్గురు యువకులు దాడి చేసి.. వివాహితను వెంబడించడంతో తప్పించుకుని 100కు డయల్ (Dial 100) చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురు యువకులు డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లను అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.