|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 06:28 AM
సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రభుత్వ సంస్థల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా వీరు జలమండలి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లా బిల్లులు వెంటనే చెల్లించకపోతే మీ కనెక్షన్ తొలగిస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.సైబర్ నేరగాళ్లు ముందుగా జలమండలి వినియోగదారుల ఫోన్ నంబర్లకు వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు. "మీరు నల్లా బిల్లు సకాలంలో చెల్లించలేదు. తక్షణమే చెల్లించకపోతే మీ నీటి సరఫరా నిలిపివేయబడుతుంది" అంటూ ఈ సందేశాలలో హెచ్చరిస్తున్నారు. ఈ మాటలు నమ్మి ఆందోళనకు గురైన కొందరు వినియోగదారులు, ఆ సందేశాలకు స్పందిస్తున్నారు.ఇదే అదనుగా భావించిన నేరగాళ్లు, ఏపీకే ఫైల్స్‌ను వినియోగదారుల ఫోన్లకు పంపిస్తున్నారు. ఈ ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే, వినియోగదారుల ఫోన్ సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ మోసపూరిత వ్యవహారం జలమండలి అధికారుల దృష్టికి రావడంతో వారు తక్షణమే స్పందించారు.ప్రస్తుతం వినియోగదారులకు వస్తున్న ఈ తరహా సందేశాలు జలమండలి పంపుతున్నవి కావని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ ఇలాంటి తప్పుడు సందేశాలకు స్పందించవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని జలమండలి అధికారులు సూచించారు.