|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:47 PM
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల స్పందించింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8.1 సబ్ వేరియంట్లను 'పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లు'గా వర్గీకరించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ మే 23న ఒక ప్రకటనలో పేర్కొంది. పలు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఎన్‌బీ.1.8.1 వేరియంట్ కారణంగా ఇన్ఫెక్షన్లు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య ఏకకాలంలో పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్ లక్షణాలను, ప్రభావాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.