|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 03:12 PM
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలి అరెస్ట్‌కు కారణమైన ఫిర్యాదుదారు వజాహత్ ఖాన్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. గత ఆదివారం రాత్రి నుంచి వజాహత్ ఖాన్ కనిపించడం లేదని, పనోలి అరెస్ట్ అయినప్పటి నుంచి తమ కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అతని తండ్రి ఆరోపించారు. ఈ పరిణామం కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది.శర్మిష్ఠ పనోలిని కోల్‌కతా పోలీసులు గురుగ్రామ్‌లో అరెస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ముస్లిం బాలీవుడ్ ప్రముఖులు మౌనంగా ఉన్నారని విమర్శిస్తూ, మతపరమైన వ్యాఖ్యలు, దూషణలతో కూడిన ఒక వీడియో పోస్ట్ చేసినందుకు గాను ఆమె అరెస్టయ్యారు. వజాహత్ ఖాన్ ఫిర్యాదుతోనే పోలీసులు శర్మష్ఠను అరెస్ట్ చేశారు.వజాహత్ ఖాన్ తండ్రి సాదత్ ఖాన్ ఓ జాతీయ చానల్‌తో మాట్లాడుతూ "పనోలి అరెస్ట్ అయినప్పటి నుంచి మాకు బెదిరింపులు వస్తున్నాయి. నా కుమారుడు అమాయకుడు, లౌకికవాది. అతను హిందూ మతాన్ని అవమానించలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి సోషల్ మీడియా ప్రొఫైల్ హ్యాక్ అయి ఉండవచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పనోలి జీవితాన్ని నాశనం చేశావంటూ వజాహత్‌కు కొన్ని రోజులుగా దూషణలు, బెదిరింపులతో కూడిన కాల్స్ వెల్లువెత్తాయని, దీంతో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడని సాదత్ ఖాన్ తెలిపారు. తనకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయని, దుర్భాషలాడారని ఆయన పేర్కొన్నారు.