|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 06:23 PM
హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్, తెలంగాణ రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం అతడి ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు వందల కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం.. అతడి అక్రమాస్తి రూ.300 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపారు. తాజాగా మరో అవినీతి కేసులో శివబాలకృష్ణపై కేసు నమోదైంది. అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసు తాజాగా నమోదైంది. తన ప్లాటు ప్రభావితమయ్యేలా లేఅవుట్ రూపొందించి అన్యాయం చేశారంటూ గచ్చిబౌలికి చెందిన మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు ఫైల్ చేశారు.
2022లో ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో 170ని జారీ చేశారు. ఆ సమయంలో శివబాలకృష్ణ హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా ఉండగా.. ఒరిజినల్ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తూ తమ భూములను సమీపంలోని 100 ఫీట్ల రోడ్డుకు కలిపేలా భూసేకరణ జరపాలంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు జీవో 170ని జారీ చేశారు. దీంతో 337 సర్వే నంబరులోని 70 అడుగుల తన ప్లాట్ ప్రభావితమవుతోందంటూ సదరు బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తూ జీవో ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆ జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ తర్వాత తన ప్లాటులో భవనాన్ని నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ బాధితురాలు హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేయగా.. ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పెట్టారు. ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. దీనిపై ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు సీఐయూ డీఎస్పీ ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించారు. ఈ మేరకు జీవో జారీలోనే అక్కమాలు ఉన్నాయని.. శివబాలకృష్ణపై కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తును సీఐయూ డీఎస్పీ లక్ష్మీకాంత్‌రెడ్డికి అప్పగించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నతాధికారుల పాత్ర ఉందా? అని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.