|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 08:06 PM
హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈనెల 7 అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాద కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. తాజాగా ఈ ఫైర్ యాక్సిడెంట్‌లో దగ్ధమైన ఫైల్స్‌పై నాగ్‌పూర్ స్పెషల్ టీమ్ కీలక ప్రకటన చేసింది. ప్రమాదంలో మొత్తం 1100 ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు గుర్తించామని పేర్కొంది. మంటల్లో కాలిపోయిన ఫైల్స్ రికవరీకి ప్రయత్నించామని.. డేటా రికవరీ చేయడం సాధ్యం కాదని తేల్చేసింది. ప్రమాదంలో మెుత్తం 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను సీజ్ చేసిన హార్డ్ డిస్కులు దగ్ధమైనట్లు తమ రిపోర్టులో వెల్లడించింది. దగ్ధమైన ఫైల్స్‌లో ఒక కీలక కేసుకు ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్‌లో కాలి బూడిదైనట్లు తెలిసింది.
రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఎఫ్ఎస్‌ఎల్ ల్యాబ్ సహాయం అందిస్తుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇక్కడే ఉంటాయి. ఫింగర్ ప్రింట్స్, బ్లడ్, హెయిర్, డీఎన్ఏ టెస్టులు, తుపాకులు, బుల్లెట్లతో పాటు విషాలు, మత్తుపదార్థాలు, గంజాయి, డ్రగ్స్, సంతకాలు, నకిలీపత్రాల పరిశీలన ఇక్కడే చేస్తారు. కాగా, ఈ అగ్ని ప్రమాద ఘటన అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నందునే సీఎం రేవంత్ అగ్ని ప్రమాదం చేయించి ఉంటారని కేటీఆర్ ఆరోపించారు. రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉండే భవనంలో ఎలా ప్రమాదం సంభవిస్తుందని ప్రశ్నించారు. ఈ ఆరోపణలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమకు బీఆర్ఎస్ పార్టీ పైనే అనుమానం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం అనుమానాలకు తావిస్తోందన్నారు.
అయితే ఈ ఆరోపణలపై FSL డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టత ఇచ్చారు. ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు ల్యాబ్‌లో లేవని చెప్పారు. అవి 2021లోనే కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా సురక్షితంగా ఉన్నాయని.. ప్రతి ఫైల్‌కు కూడా బ్యాకప్ ఉంటుందని తెలిపారు.