|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 08:49 PM
పటాన్ చెరు : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గిరిపుత్రులు, గిరిజనుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని.. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం భానూరు పరిధిలోని బిడిఎల్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణానికి పదిహేను లక్షల రూపాయల సొంత నిధులు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు..పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో శనివారం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం నుండి జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు పెద్ద పీట వేయడం జరిగిందని తెలిపారు. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి రంగంలోనూ గిరిజన బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గర్వకారణమని అన్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని వెలిమెల, కొల్లూరు, రాళ్లకత్వ, ఐలాపూర్, కొత్తపల్లి తండాల పరిధిలో సొంత నిధులతో శ్రీ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మించామని గుర్తు చేశారు. జయంతులు, వర్ధంతుల సమయాల్లోనే మహనీయుల సేవలను గుర్తించుకోవడం కాకుండా.. నిరంతరం వారి నుండి స్ఫూర్తి పొంది ముందుకు కొనసాగాలని సూచించారు.భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మానవజన్మ అని.. పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ జన్మకు పరిపూర్ణత లభిస్తుందన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభమైందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యార్థులను నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
అనంతరం ఉత్సవ సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ముత్తమ్మ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, బంజారా సంక్షేమ సంఘం, బంజారా ఉద్యోగ సంఘం ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.