|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 11:22 PM
ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తకు అండగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు .. నిలిచారు. 3 ఏళ్ల పిల్లాడు గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకుని.. తన వంతు సాయంగా రూ.లక్ష చెక్కు అందించారు. ఆ బాలుడి వైద్య ఖర్చుల కోసం హైదరాబాద్‌లో ఉన్న అతని కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామానికి చెందిన జనసైనికుడు కట్టా రామకృష్ణ కుమారుడు 3 ఏళ్ల శ్రీహర్ష గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీహర్ష గత 26 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీహర్ష పరిస్థితి విని తీవ్ర విచారం వ్యక్తం చేసిన నాగబాబు.. వారి కుటుంబాన్ని ఆదుకుని.. ధైర్యం చెప్పారు. అదే సమయంలో ఆ శ్రీహర్ష ప్రాణాలు కాపాడేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా నాగబాబు పిలుపునిచ్చారు.
శ్రీహర్షకు గుండె నుంచి కేవలం 10 శాతం మాత్రమే రక్తం సరఫరా అవుతున్నట్లు డాక్టర్లు చెప్పడంతో అతడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇక గత 26 రోజులుగా అతడికి ఇస్తున్న చికిత్స కోసం ఇప్పటికే ఆ కుటుంబం రూ. 13 లక్షలు ఖర్చు చేసింది. చికిత్స చేసేందుకు ఇంకో రూ. 10 లక్షలు కావాలని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం చిన్నారి పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గానే ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన నాగబాబు.. చిన్నారి ప్రాణాలు రక్షించేందుకు తన వంతుగా రూ.లక్ష ఇచ్చారు.
దాతలు స్పందించి అతడికి సాయం చేసి ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా నాగబాబు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే శ్రీహర్ష తండ్రి కట్టా రామకృష్ణ తనను కలిసిన వీడియోతో పాటు బాధితుడికి సాయం చేసేందుకు.. క్యూఆర్ కోడ్‌ను కూడా సోషల్ మీడియాలో నాగబాబు షేర్ చేశారు. శ్రీహర్ష త్వరగా కోలుకోవాలని తండ్రికి ధైర్యాన్ని ఇచ్చారు. పసివాడి ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉన్నవారు చేతనైనంతలో సహాయం అందించాలని ఈ సందర్భంగా నాగబాబు పిలుపునిచ్చారు. కట్ట రామకృష్ణ సీసీటీవీ కెమెరా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.