![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 12:58 PM
దారుణంగా జరుగుతున్న వరుస హత్యలు. ఎవరు చేస్తున్నారో .. ఎందుకు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నానా తంటాలు పడుతూ ఉంటుంది. ఎందుకంటే హత్యలు జరుగుతున్న ప్రదేశంలో ఎలాంటి 'క్లూ' లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుని కూర్చుంటారు. అప్పుడు ఒక యువకుడు ఎంట్రీ ఇస్తాడు. శవాన్ని అలా టచ్ చేసి .. హత్య ఎవరు చేశారనేది ఠపీమని చెప్పేస్తాడు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో తెలుగులో ఇంతవరకూ సినిమాగానీ .. సీరియల్ గానీ రాలేదు. సైకో మెట్రిక్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సిరీస్ పేరే 'టచ్ మీ నాట్'. గతంలో నాగశౌర్యతో 'అశ్వద్ధామ' సినిమాను తెరకెక్కించిన 'రమణ తేజ' ఈ సిరీస్ కి దర్శకుడు. సునీత తాటి నిర్మించిన ఈ తెలుగు సిరీస్ లో నవదీప్ - 'దసరా' మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సిరీస్ 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ కానుంది. ఇది 'సైకో మెట్రిక్' కాన్సెప్ట్ తో సాగే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. మర్డర్ జరిగిన తరువాత ఒక యువకుడు ఆ శవాన్ని తాకి .. హంతకుడు ఎవరనేది చెబుతూ ఉంటాడు. అప్పుడు పోలీసులు ఆ దిశగా తమ వేట మొదలుపెడుతూ ఉంటారు. అతనికి ఆ పవర్ ఎలా వచ్చింది? ఎలా అతను ఆ విషయాన్ని చెప్పగలుగుతున్నాడు? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో కోమలి ప్రసాద్సం, చిత, హర్షవర్ధన్ , బబ్లూ పృథ్వీరాజ్, ప్రమోదిని కనిపించనున్నారు.
Latest News