![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:41 AM
సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలు, సహజీవనం (డేటింగ్), వివాహం, విడాకులు సర్వసాధారణం. అయితే, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి సోషల్ మీడియా తొంగి చూడటం, ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారం చేయడం, వాటిని వారు ఖండించడం నిత్యకృత్యంగా మారింది. మొదట ఒకరిని ఇష్టపడటం, కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయి మరొకరితో ప్రేమాయణాలు కొనసాగించడం మనం చూస్తూనే ఉన్నాం.ఇటీవల తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, గాయని సైంధవి తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, జీవీ విడాకులకు హీరోయిన్ దివ్య భారతి కారణమని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. గతంలో జీవీ ప్రకాశ్, దివ్య భారతి ఈ వివాదంపై స్పందించి వివరణ ఇచ్చినప్పటికీ, వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగుతోందని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై దివ్య భారతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.ఆమె ఈ పుకార్లపై తీవ్రంగా మండిపడ్డారు. తనకెలాంటి సంబంధం లేని వ్యక్తుల కుటుంబ విషయాల్లో తన పేరును లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీ ప్రకాశ్ కుటుంబ సమస్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని, ముఖ్యంగా వివాహితులతో అసలు డేటింగ్ చేయనని కుండబద్దలు కొట్టారు. ఆధారాలు లేకుండా నిందలు వేయొద్దని పేర్కొన్నారు.వాస్తవానికి ఈ విషయంపై స్పందించాలని అనుకోలేదని, కానీ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తన సహనాన్ని పరీక్షిస్తున్నాయని అన్నారు. ఈ రూమర్స్ వల్ల తన పేరు చెడిపోతుందని, అందుకే స్పందించక తప్పడం లేదని తెలిపారు. తప్పుడు వార్తలు సృష్టించడం మానుకుని సమాజానికి ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. వ్యక్తిగత జీవితానికి కాస్త గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, ఇదే తన మొదటి మరియు చివరి ప్రకటన అని దివ్య భారతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దివ్య భారతి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News