![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 07:49 PM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రెండుసార్లు మాత్రమే వచ్చారని, కానీ ప్రతిపక్ష నేతగా ఆయన తీసుకున్న జీతభత్యాలు రూ. 57,84,124 అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 2023 డిసెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దాదాపు పదిహేను నెలల పాటు జీతభత్యాలు తీసుకున్నారని తెలిపారు. శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు తెలిపిందని గుర్తు చేశారు.లక్షల రూపాయల జీతం తీసుకొని రెండు రోజులు మాత్రమే సభకు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా పర్యటనలకు కూడా వెళ్లలేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజా సమస్యలపై చట్టసభల్లో ప్రస్తావించిన సందర్భాలు కూడా లేవన్నారు. కరోనా సమయంలో ఇంటి నుంచి పని చేసేందుకు వెసులుబాటు ఉండేదని, కానీ ఇప్పుడు అది కూడా లేదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఫాం హౌస్ ఏమైనా ఉందా అని చురక అంటించారు.