![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:02 PM
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే స్థాయి తనకు లేదని భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే బీఆర్ఎస్‌లో మాత్రం ఆయనది వన్ సైడ్ లవ్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద హరీశ్ రావుకు ప్రేమ ఉందని, కానీ ఆయన మామకు మాత్రం ఈయనపై ప్రేమ లేదని వ్యాఖ్యానించారు.తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనను తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బుధవారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఏఐసీసీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ కితాబిచ్చారని అన్నారు. కాంగ్రెస్ పాలనపై హరీశ్ రావు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ బీసీ దీక్షకు రాహుల్ గాంధీ హాజరుకాకపోవడంపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. సమాచార లోపం వల్లే ఆయన హాజరు కాలేదని తెలిపారు. హరీశ్ రావు ఏదో ఒక వంకతో కాంగ్రెస్ నేతలపై విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా బీసీ వ్యక్తి ఉన్నారని, బీఆర్ఎస్‌లో అలాంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీసీ వ్యక్తిని అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు.హరీశ్ రావు కళ్లుండి చూడలేని, చెవులుండి కూడా వినలేని కబోది అని విమర్శించారు. ఏ పార్టీలో ఉన్నా కార్యకర్త కష్టపడితే గుర్తించాలని, కేసీఆర్ పార్టీలో హరీశ్ రావే సేనాధిపతి అని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన ఢిల్లీ నుంచి తెలంగాణలో దిగగానే కార్పొరేటర్ స్థాయికి మారిపోతారని ఎద్దేవా చేశారు.