![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 09:27 PM
తెలంగాణలో భూకంపం వస్తుందన్న వార్తలు ప్రజలను కొన్ని రోజులుగా భయపెడుతున్నాయి. అయితే.. ఎపిక్ ఎర్త్ క్విక్ అనే సంస్థ చెప్పిన భూకంప వార్తలు పూర్తిగా నిరాధారమని.. ఎలాంటి శాస్త్రీయత లేదని ఎన్‌జీఆర్ఐ తెలిపింది. ఈ వార్తలు నమ్మొద్దని ప్రజలకు సూచించింది. ప్రభుత్వమో లేక శాస్త్రీయ సంస్థలు అధికారికంగా ప్రకటించినప్పుడే నమ్మాలని సూచించింది.
ఎపిక్ ఎర్త్‌క్విక్ సంస్థ ఏమన్నదంటే..
ఎపిక్ ఎర్త్‌క్విక్ సంస్థ ప్రకారం, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం కేంద్రంగా పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉందని.. అది హైదరాబాద్, అమరావతి వరకు ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వటంతో.. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి.
ఈ వదంతులపై ఎన్జీఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్ స్పందించారు. ఇపిక్ భూకంప సంస్థ తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని.. వారికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవని... ప్రజలు ఈ ప్రచారాలను నమ్మవద్దని శశిధర్ హెచ్చరించారు. అలాగే.. భూకంపాలను ముందుగా ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యపడదని తెలిపారు. కొన్ని చిన్నచిన్న ప్రకంపనలు కనిపించినా.. అవి పెద్ద భూకంపానికి సంకేతాలు కావని క్లారిటీ ఇచ్చారు. ఎన్జీఆర్ఐ తరపున కొనసాగుతున్న నిక్షిప్త పరిశోధనలు, గమనికల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి భూకంప ప్రమాదం లేదని శశిధర్ స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాలు జోన్-2, జోన్-3లో ఉంటాయని శశిధర్ తెలిపారు. రామగుండం, గోదావరి పరివాహక ప్రాంతం జోన్-3 గా ఉందని.. కానీ భూకంపం సంభవించే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతం ఎర్త్ ప్లేట్ బౌండరీకి దూరంగా ఉండడం వల్ల భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని శశిధర్ తెలిపారు. భూంకపం వచ్చే సంకేతాలు ఉంటే ప్రభుత్వం, ఆయా సంస్థలు ముందే అప్రమత్తం చేస్తాయని చెప్పారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని.. భయపడాల్సిన అవసరం లేదని శశిధర్ సూచించారు.
మొత్తంగా తెలంగాణలో భూకంపం వస్తుందని ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారమని.. ప్రజలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని ఎన్జీఆర్ఐ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భయానికి బదులుగా అవగాహన అవసరమని.. శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ధ్రువీకరించారు.
భూమిలో జరిగే సూక్ష్మ ప్రకంపనలను, అణు మార్పులను ఆధారంగా చేసుకుని, పలు శాస్త్రీయ పరికరాల ద్వారా భూకంపం సూచనలు నమోదు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడిన పద్ధతులే నిజమైన సమాచారం అందిస్తాయి. ఇందులో.. సీస్మోగ్రాఫ్ పరికరాలు, ఉపగ్రహ పర్యవేక్షణ, భూ కదలికల రికార్డింగ్ కేంద్రాలు చేసే అత్యంత ఖచ్చితమైన గణనల తర్వాతే భూకంపాలపై హెచ్చరికలు ఇస్తారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పలు పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఎన్జీఆర్ఐ ప్రముఖమైనది.
విశ్వసనీయతలేని సంస్థలు, సోషల్ మీడియాలో జరిగే అసత్య వార్తలను నమ్మొద్దు. అధికారిక ప్రభుత్వ లేదా శాస్త్రీయ సంస్థల ప్రకటనలకే ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వాట్సాప్, సోషల్ మీడియాల్లో వచ్చే వార్తలు నమ్మటమే కాకుండా వాటిని ఇతరులకు షేర్ చేస్తూ.. మీరు భయపడటమే కాకుండా మిగతావారిని కూడా ఆందోళనకు గురి చేయొద్దు.