|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 07:56 PM
తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో అద్భుత ప్రగతి సాధించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన.. టోక్యోలో తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో ఆశించిన ప్రగతి సాధించిందని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. టోక్యోలోని రివర్‌ఫ్రంట్‌ను పరిశీలించామని, మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ పరిస్థితిని చూసి గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు తెలంగాణ అభివృద్ధికి కీలకమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమల పెరుగుదల, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని సీఎం ముఖ్యమంత్రి కోరారు. ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని, సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం అందరికీ తెలుసని చెప్పారు.
సుమిదా నదిని సందర్శించిన సీఎం రేవంత్ బృందం.. కాగా, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్‌లోని టోక్యో వాటర్ ఫ్రంట్ ను సందర్శించింది. టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. టోక్యో నగరం మధ్యన జల రవాణాకు అనుగుణంగా రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడం, సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చిందనే విషయాలను ఈ ప్రతినిధి బృందం పరిశీలించింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరాన్ని మహా అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం టోక్యో రివర్ ఫ్రంట్‌ను క్షణ్ణంగా పరిశీలించింది.