|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 12:27 PM
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఓడించేందుకు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికార, ప్రతిపక్ష పార్టీలు కావాలనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీకి అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో హక్కు అని, కానీ కార్పొరేటర్లు ఓటు వేయకుండా బీఆర్ఎస్ అగ్రనేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ రజాకార్ల వారసుల పార్టీ అని ధ్వజమెత్తారు. మతతత్వ మజ్లిస్ పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు.బీజేపీకి బలం లేకపోయినప్పటికీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచింది. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి.