|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 11:44 AM
ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లోనే మురుగు సమస్యకు హైడ్రా పరిష్కారం చూపింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలం మల్లంపేటలోని రామచంద్రయ్య కాలనీకి మురుగు ముప్పును తొలగించింది. చెన్నం చెరువు నుంచి రేళ్లకుంటకు వెళ్లే కాలువకు మధ్యలో ఆటంకాలు సృష్టించడంతో రామచంద్రయ్య కాలనీలో కొంత భాగం మురుగు ముప్పును ఎదుర్కొంది. మీటరుకు పైగా ఇళ్లు మురుగులో మునిగిపోవడంతో అక్కడి నివాసితులు ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. మురుగు నీటిలో మా ఇళ్లు నీట మునిగాయని.. నెల రోజులుగా ఇళ్లు ఖాళీ చేసి బయట తలదాచుకుంటున్నామని రామచంద్రయ్య కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. దుండిగల్ మున్సిపాలిటీలోని చెన్నం చెరువు కు నిజాంపేట మున్సిపాలిటీ మురుగు నీరు వచ్చి చేరుతోందని.. ఆ నీరు బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని రేళ్లకుంటకు చేరాల్సి ఉండగా ఆటంకాలు ఏర్పడ్డాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. రామచంద్రయ్య కాలనీకి పక్కన లే ఔట్ వేసిన వారు కాలువను మూసేయడంతో ఈ ఇబ్బంది తలెత్తిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఈ ఫిర్యాదును గూగుల్ మ్యాప్స్‌తో పాటు శాటిలైట్ ఇమేజీలలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం హైడ్రా అధికారులు అక్కడకు చేరుకుని మురుగు కాలువను పునరుద్ధరించారు. దీంతో రామచంద్రయ్య కాలనీలో నిలిచిన మురుగు నీరు బయటకు వెళ్లింది. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా 24 గంటలలోపే పరిష్కారం లభించడం పట్ల రామచంద్రయ్య కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.