|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 04:02 PM
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన భయానక ఉగ్రవాద దాడి ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి పూర్తిగా నిఘా వైఫల్యం వల్లే జరిగిందని ఆయన ఆరోపించారు. నేడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఒవైసీ, ఈ దుశ్చర్యకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.పహల్గామ్ ఘటనను ఒక 'ఊచకోత'గా అభివర్ణించిన ఒవైసీ, ఉగ్రవాదులు మతం అడిగి అమాయక ప్రజలను అత్యంత కిరాతకంగా హతమార్చారని అన్నారు. "పహల్గామ్‌లో మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు నిఘా వైఫల్యమే కారణం" అని ఆయన స్పష్టం చేశారు. ఇది గతంలోని ఉరి, పుల్వామా సంఘటనల కన్నా ప్రమాదకరమైనదని, తీవ్ర విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని, బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. నిన్న కూడా ఒవైసీ ఈ దాడిని ఖండించారు. సైనిక దుస్తుల్లో వచ్చి అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం హేయమైన చర్య అని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.