|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 04:07 PM
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు సహకరించిందని, సభ ముగిసే వరకు ఇదే సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాట సభ కాదని, కేవలం పార్టీ వార్షికోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ హిమాలయాల స్థాయికి తీసుకెళ్లారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారు గులాబీ జెండా వైపే చూస్తున్నారని, బీఆర్ఎస్ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని కేటీఆర్ అన్నారు.వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ గతంలో అనేక విజయవంతమైన సభలు నిర్వహించిందని, ఇప్పుడు పార్టీ వార్షికోత్సవ సభకు కూడా ఇదే వేదిక కావడం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నామని, సుమారు 40 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. వేసవి దృష్ట్యా 10 లక్షల మంచి నీటి బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని, వైద్య సేవలకు గాను 100 వైద్య బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.