|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 12:57 PM
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.దాదాపు 38 మందికి పైగా మావోయిస్టులు మృతి. ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా భద్రతా బలగాల కూంబింగ్.ఎదురుకాల్పుల్లో ఓ జావాన్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం కర్రెగుట్టల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. కర్రెగుట్టలే టార్గెట్‌గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతాబలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.
మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అంతా వార్‌జోన్‌గా మారింది. మావోయిస్టుల అగ్రనేతలే టార్గెట్‌గా సాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టల్లో గత నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక మావోయిస్టులకు పెట్టని కోటలాగా కర్రెగుట్టలు ప్రాంతం ఉంది. 145 ఎకరాల విస్తీర్ణం ఉన్న కర్రెగుట్టల చుట్టూ దాదాపు పదివేల మంది భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు వేలాది మంది మావోయిస్టులు ఉన్నట్లు భద్రతాబలగాలు గుర్తించాయి. వారి లక్ష్యంగానే కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ములుగు జిల్లా సరిహద్దు నుంచి ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా వరకు అలాగే మహారాష్ట్రలో గడ్చిరోలి ప్రాంతంలో ఉన్న నదుల నుంచి మావోయిస్టులు తప్పించుకోకుండా మూడు వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాదాపు కొద్ది రోజులుగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. అధునాత ఆయుదాలతో సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పై నుంచి బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భీకరమైన కాల్పుల్లో ఇప్పటి వరకు 38 మంది మావోయిస్టుల చనిపోయినట్లు తెలుస్తోంది.
కాగా.. ఇప్పటి వరకు కర్రెగుట్టల్లో జరుగుతున్న భీకరకాల్పులపై ప్రజాస్వామ్య వాదులు, పౌరహక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కర్రెగుట్టల నుంచి భద్రతాబలగాలు వెనక్కి తగ్గాలని చెబుతున్నారు.