|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 08:55 PM
హైదరాబాద్ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధానమివ్వాలని, ముఖ్యంగా భవనాల్లో విద్యుత్ భద్రతను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయంలో 'భవనాల్లో విద్యుత్ భద్రత' అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ప్రమాదాల నివారణకు సంబంధించి విద్యుత్, అగ్నిమాపక, పరిశ్రమల వంటి వివిధ ప్రభుత్వ విభాగాలు వేర్వేరుగా కాకుండా, ఒకే వేదికపైకి వచ్చి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతను రంగనాథ్ నొక్కిచెప్పారు. తరచుగా సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణం విద్యుత్ వినియోగంలో లోపాలేనని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఇలాంటి దుర్ఘటనలను అరికట్టాలంటే, విద్యుత్ భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, కఠినమైన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజల భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు సంబంధిత విభాగాల నిపుణులతో కూడిన ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏజెన్సీ కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు, నివాస గృహాల్లో సైతం విద్యుత్ వైరింగ్, ఎర్తింగ్ నాణ్యత, వినియోగిస్తున్న విద్యుత్ పరికరాల ప్రమాణాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆయన స్పష్టం చేశారు."ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాత విచారణ చేపట్టడం కన్నా, అసలు అలాంటి ప్రమాదాలకు ఆస్కారమే లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే" అని రంగనాథ్ తెలిపారు. ఈ సమన్వయ బాధ్యతను హైడ్రాకు చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ విభాగం చొరవ తీసుకుని ముందుకు నడిపించాలని ఆయన సూచించారు.