|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 08:28 PM
హైదరాబాద్ నగరంలోని పేదోడి కడుపు నింపేందుకు రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకం హైదరాబాద్‌లోనూ మే 1 నుంచి ప్రారంభం చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఇంతకాలం ఎదురుచూసిన నగర పేదలకు ఇకపై సన్న బియ్యం ఉచితంగా అందనుంది.
రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచే ఈ పథకం ప్రారంభమైనప్పటికీ.. ఎన్నికల నియమావళి కారణంగా హైదరాబాద్‌లో ఈ పథకం అమలు కాలేదు. అయితే.. ఈ నెల 25న ఎన్నికల కోడ్ ముగియడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. నగరంలోని 653 రేషన్ షాపులకు ఇప్పటికే సన్నబియ్యం చేరవేసే ప్రక్రియ మొదలైంది. ఇకపై రేషన్ కార్డు ఉన్న ప్రతి అర్హుడు నెలకు 6 కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా పొందనున్నాడు.
గతంలో పంపిణీ చేసిన నాణ్యత లేని బియ్యంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు సైతం నాణ్యమైన బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని కోసం ప్రభుత్వం ఏటా ఏకంగా రూ. 10,600 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలోని దాదాపు 3.10 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
దేశంలోనే తొలిసారి..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న పథకమని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ పథకం శాశ్వతంగా కొనసాగుతుందని, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం మారినా దీనిని నిలిపివేయడానికి సాహసించదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి త్రివర్ణ రేషన్ కార్డులు, పేదరిక రేఖకు పైన ఉన్న వారికి ఆకుపచ్చ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. త్వరలోనే ఈ కార్డులు లబ్ధిదారులకు అందుతాయని అధికారులు తెలిపారు. మొత్తానికి, హైదరాబాద్‌లోని పేద ప్రజలు ఇకపై నాణ్యమైన సన్నబియ్యం తినాలనే వారి కల త్వరలోనే నెరవేరనుంది. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపనుంది.