|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 08:38 PM
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐనన్‌పల్లి వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని గనుగాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శించుకొని తిరిగి వస్తుండగా.. చిట్లపల్లి-యాలమద్ది మధ్య జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన బొలెరో ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులకు సంబంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా ముగ్గురు మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మహ్మద్ అలీ (45), అస్మా బేగం (40), వారి మనవడు గౌస్ (1)గా గుర్తించారు. క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు.
కాగా, తెలంగాణ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలలో నిర్లక్ష్యం, అతివేగం ముఖ్యమైనవి. చాలా సందర్భాల్లో వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వంటి నిర్లక్ష్యపూరితమైన చర్యల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది యువకులు అతివేగంగా వాహనాలు నడపడానికి ప్రయత్నించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేకపోవడం, గుంతలు ఉండటం లేదా సరైన సూచికలు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాలి. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. రోడ్ల నాణ్యతను మెరుగుపరచాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తిస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు. అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చు.