|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 06:33 AM
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ రజతోత్సవ సభలో చేసిన ప్రసంగంపై రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని, ఆయన ప్రసంగంలో కాంగ్రెస్‌ను విలన్‌గా చూపించడం తప్ప మరేమీ లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి పొంగులేటి నేడు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.కేసీఆర్ ప్రసంగంలో మంచి సలహాలు, సూచనలు ఉంటాయని ఆశించామని, కానీ కడుపంతా విషం నింపుకొని మాట్లాడటం బాధ కలిగించిందని పొంగులేటి అన్నారు. "తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరిస్తారా రెండుసార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారు. గత సీఎం పాలన వల్లే ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. అయినా మేము ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం" అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఐదారు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కేవలం రెండుసార్లే హాజరయ్యారని, అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా వెళ్లలేదని విమర్శించారు. "కేసీఆర్ దొరలా పరిపాలిస్తే, మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉంది. కాంగ్రెస్ అందిస్తున్న మంచి పాలనను తట్టుకోలేకే కేసీఆర్ విషం కక్కుతున్నారు" అని పొంగులేటి మండిపడ్డారు.గతంలో వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్, తానే 150 ఎకరాల్లో వరి పండించారని, ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.82 వేల కోట్లు బకాయిలు పెట్టిందని, సర్పంచులకు తమ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని కేసీఆర్ అనడం హాస్యాస్పదమని, తమ ప్రభుత్వం వచ్చాక ఇంకా సర్పంచ్ ఎన్నికలే జరగలేదని, వారు ఒక్క రూపాయి పని కూడా చేయలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభకు ఆటంకాలు సృష్టించామన్న ఆరోపణలను ఖండించారు. తాము అడ్డుకుంటే సభ జరిగేదా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆస్తులు అమ్ముతున్నామన్న ఆరోపణల్లో నిజం లేదని, ధరణి పోర్టల్ లో జరిగిన కుంభకోణాల గురించి, ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సన్నబియ్యం గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చినా దాని గురించి ప్రస్తావించకపోవడం విడ్డూరమన్నారు. ఏ అంశంపైనైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధమని, కేసీఆర్ తేదీ చెప్పాలని సవాల్ విసిరారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని, దళితుడికి కనీసం ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, మళ్లీ సీఎం అవుతాననే భ్రమలో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పొంగులేటి అన్నారు.