|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 11:21 AM
జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ లాంటి వాటిని గెలుచుకోగా.. తాజాగా మరొక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న చర్యలు, మంచి పారిశ్రామిక సంబంధాలకు గానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ యాజమాన్య పురస్కారాన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రకటించింది.ఈ అవార్డును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి రవీంద్ర భారతిలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా గురువారం అందుకున్నారు. ప్రభుత్వ విభాగాల్లో జలమండలికి మాత్రమే ఈ అవార్డు దక్కడం విశేషం.బోర్డు పరిధిలో పనిచేసే కార్మికుల భద్రతకు జలమండలి పెద్దపీట వేస్తోంది. పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చూస్తోంది. విధులు నిర్వర్తించేటప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు అన్ని డివిజన్లలో భద్రతా వారోత్సవాలు ఏటా నిర్వహిస్తోంది. పారిశుద్ధ్య పనుల్లో ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) గైడ్ లైన్స్ అమలుపై, భద్రతా పరికరాల పనితీరు, వాటిని ఉపయోగించే విధానం, మురుగు నీటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం సంభవించినపుడు చేసే ప్రథమ చికిత్స వంటి అంశాలపై కార్మికులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా కార్మికుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులను సైతం జారీ చేసి ఆర్నెళ్లకోసారి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుంది.ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో పర్సనల్ డైరెక్డర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఉన్నతాధికారులు, ఉగ్యోగులు పాల్గొన్నారు.