|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 11:07 AM
చెరువుల అభివృద్ధిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పనులు ఆగకుండా చూడాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హైడ్రా అధికారులకు సూచించారు. చెరువుల అభివృద్ధికి తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల్లో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. హైడ్రా ఇంజినీర్లు మోహన్, నాగరాజు, ఇన్‌స్పెక్టర్ మల్లేష్‌తో పాటు డీపీఆర్‌లు రూపొందించిన విమోస్ టెక్నోక్రాట్స్ కన్సల్టెంట్ యూనస్ తదితరులు గురువారం ఎమ్మెల్యేను కలిసి తమ్మిడికుంట అభివృద్ధి పనులను వివరించారు. చెరువులో పూడిక తీత నుంచి ఇన్‌లెట్, ఔట్‌లెట్ల ఏర్పాటు, బండ్ నిర్మాణం గురించి ఎమ్మెల్యేకు తెలిపారు. హైడ్రా అధికారులతో కలిసి తమ్మిడికుంట అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మురుగు నీరు కలవకుండా.. చూడాలని.. వర్షాకాలంలో చెరువు నిండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చాలన్నారు.