|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 08:19 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి ఇష్యూ హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరిగా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాను దర్శించుకున్నారు. ఆ సమయంలో పలు చోట్ల అఘోరి హల్‌చల్ చేసింది. ఆ తర్వాత ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్ శ్రీవర్షిణిని పెళ్లి చేసుకోవటం, తదనంతర సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపాయి.
వీరి అసాధారణ సంబంధం మీడియాలో, ప్రజల్లో చర్చనీయాంశమైంది. వారి వివాహం తర్వాత అఘోరి శ్రీనివాస్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. పూజల పేరుతో భక్తుల నుండి డబ్బు వసూలు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. తాను అఘోరి శ్రీనివాస్ మొదటి భార్య అని, అతడు తనను విడాకులు తీసుకోకుండానే శ్రీవర్షిణిని వివాహం చేసుకున్నాడని మరో మహిళ సైతం ఆరోపించింది.
ఓ మహిళకు ప్రత్యేక పూజలు చేసి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి రూ. 9.8 లక్షలు మోసం చేసినందుకు అతడిని అరెస్టు చేశారు. శ్రీవర్షిణిని కౌన్సిలింగ్ సెంటర్‌కు పంపి, తర్వాత ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అఘోరి శ్రీనివాస్‌ను ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అఘోరిపై మోసం, బెదిరింపు, దోపిడీ ఆరోపణలు ఉన్నాయి. కాగా, అఘోరీని చూసేందుకు ఇవాళ తండ్రి, అక్కా బావ చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. ములాఖత్‌లో అఘోరీని పరామర్శించి ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వల్లే అఘోరీని అరెస్టు చేశారని అఘోరి తండ్రి మండిపడ్డారు. మీడియా ప్రతినిధులను తోసేసి, బెల్లంపల్లికి వస్తే చూసుకుంటామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని.. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తన కొడుకును అకారణంగా జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో మీడియాతో ఏం మాట్లాడనని.. బెల్లంపల్లి వస్తే చూసుకుంటానంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అందుకు సబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.