|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 06:51 PM
తెలంగాణలో రాజకీయ విమర్శలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణమని చంద్రబాబు చెప్పుకోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు మాటలు హాస్యాస్పదంగా, మోసపూరితంగా ఉంటాయని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. పదే పదే హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ‘చంద్రబాబువి చెత్త మాటలు కొట్టి పారేద్దాం అనుకుంటే, వంద సార్లు అవే చెబితే ప్రజలు నిజమని నమ్ముతారు’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని జగదీష్ రెడ్డి అన్నారు.
జగదీష్ రెడ్డి తన విమర్శలకు గణాంకాలను జోడించి చంద్రబాబు పాలనపై ప్రశ్నలు సంధించారు. ‘2004లో చంద్రబాబు దిగిపోయేనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 25,900 మాత్రమే’ అని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత, 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్లు పరిపాలిస్తే, అదే సమయంలో తెలంగాణను కేసీఆర్ తొమ్మిదేళ్లు (2014-2023) పాలించారని జగదీష్ రెడ్డి ప్రస్తావించారు. అప్పుడు మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాని అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందని జగదీష్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని ప్రశంసించారు. అయితే.. చంద్రబాబు ఐదేళ్లు ఏపీలో పని చేసినా అక్కడ తలసరి ఆదాయం తెలంగాణ మాదిరిగా పెరగలేదని ఆయన విమర్శించారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన నాడు రూ. 1,12,000 తలసరి ఆదాయం ఉంటే.. నేడు తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,60,000కు చేరుకుందని జగదీష్ రెడ్డి గణాంకాలతో వివరించారు. కానీ, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 2,50,000 మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ‘నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదని జగదీష్ రెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అభివృద్ధి పోలికలను, నాయకుల మధ్య జరుగుతున్న రాజకీయ విమర్శల తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.