|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 06:57 PM
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ వ్యవస్థల బలోపేతంలో భాగంగా.. కొత్తగూడెం మున్సిపాలిటీకి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. ఈ విస్తరణలో భాగంగా.. కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలిపి కొత్తగూడెం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో (ప్రభుత్వ ఉత్తర్వులు) జారీ చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుపై ఇప్పటికే గెజిట్ విడుదలైన విషయం తెలిసిందే. నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్‌కు తాత్కాలికంగా కమిషనర్‌గా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాతను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కమిషనర్ నియామకం పూర్తయ్యే వరకు ఆమె ఈ అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
ఇక నుంచి పాల్వంచ మున్సిపాలిటీతో పాటు సుజాతనగర్ మండలంలోని మంగపేట, సుజాతనగర్, నర్సింహసాగర్, కొమిటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, నాయకుల గూడెం గ్రామపంచాయతీలకు సంబంధించిన అన్ని పరిపాలనా కార్యక్రమాలు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోనే జరుగుతాయి. విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
కొత్తగూడెం కార్పొరేషన్ విస్తరణతో జనాభాలో గణనీయమైన పెరుగుదల నమోదవుతుంది. భారత జనగణన గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపాలిటీ జనాభా 1,88,191గా ఉంది. పాల్వంచ పరిధిలో లక్ష మందికి పైగా నివసిస్తున్నారు. వీటికి అదనంగా.. సుజాతనగర్ మండలంలోని 7 పంచాయతీల పరిధిలో 11,124 మంది, చుంచుపల్లిలోని 14 పంచాయతీల పరిధిలో 41,860 మంది, లక్ష్మీదేవిపల్లి మండలంలోని 10 పంచాయతీల్లో 21,432 మంది, పాల్వంచలోని 4 పంచాయతీల్లో 5,903 మంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుకుంటే.. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో సుమారు 4 లక్షలకు పైగా జనాభా చేరే అవకాశం ఉంది.
పాలనా సౌలభ్యం కోసం.. ప్రస్తుత కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచే కార్పొరేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విలీనమైన పాల్వంచ మున్సిపాలిటీని ఒక సబ్-జోన్‌గా విభజించనున్నారు. ఇదే క్రమంలో.. సుజాతనగర్ మండలంలోని విలీన గ్రామ పంచాయతీలకు గానూ మరో సబ్-జోనల్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందించడానికి దోహదపడుతుంది.
జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెంను నగర పాలక సంస్థగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ డిమాండ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయడం ద్వారా దశాబ్దాల కలను సాకారం చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుతో కొత్తగూడెం ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ అభివృద్ధి, పౌర సేవలు మరింత మెరుగుపడతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ ప్రాంత అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలవనుంది. తెలంగాణలో ఇటీవల కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ అయిన మహబూబ్‌నగర్, మంచిర్యాలతో కలిపి 15 కార్పొరేషన్లు ఉండగా.. తాజాగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌తో ఆ సంఖ్య 16కు చేరింది.