|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 07:30 PM
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా పలువురు లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. వారు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. చాలా చోట్ల ముగ్గు పోయటం పూర్తయ్యింది. కొన్ని చోట్ల అయితే శ్లాబులు వేసే వరకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో భాగాంగా ఇప్పటికే చాలా గ్రామాల్లో లబ్దిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. అయితే వీరిలో చాలా మందికి ఇంకా ప్రోసిడింగ్స్ కాపీలు అందలేదు. అలానే చాలా చోట్ల ఇందిరమ్మ ఇళ్లకు వయోపరిమితిని లింక్ చేన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవివరాలు..
మంత్రి పొంగులేటి శ్రీనివాసర్ రెడ్డి గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సూచనలు చేశారు.. ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వయో పరిమితి ఉందా అనే వార్తలపై ఆయన స్పందిస్తూ.. లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదని.. అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
చాలా చోట్ల వయోపరిమితి కారణంగా.. దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు అధికారులు వయోపరిమితిని సాకుగా చెప్పి.. దరఖాస్తులను పక్కనపెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి వీటిపై స్పందిస్తూ.. ఇందిరమ్మ ఇళ్లు పొందే అంశంలో.. లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదని స్పష్టం చేశారు.
అలానే ప్రోసిడింగ్స్ కాపీల జారీలో తీవ్ర ఆలస్యం జరుగుతుండటంపై పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి.. కలెక్టర్లు ప్రోసీడింగ్స్ ఇవ్వకుండా తమ దగ్గరే పెట్టుకుని.. లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం మంచి పద్దతి కాదన్నారు. ఇప్పటివరకు కనీసం 50 శాతం మంది లబ్ధిదారులతో కూడా లిస్ట్ ప్రకటించక పోవడం బాధాకరమన్నారు. జూన్ 06 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిధుల విడుదలలో ఆలస్యం చేయడం లేదు. ఇంటి నిర్మాణ పనులు ఏమేరకు పూర్తయ్యాయో గమనిస్తూ.. దానికి సంబంధించినంత వరకు ప్రతి సోమవారం గృహ నిర్మాణ శాఖ ద్వారా నిధులను అందిస్తోంది. ఈ మొత్తాన్ని.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా 4 విడతల్లో.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు పొందిన లబ్ధిదారులు 400-600 చదరపు అడుగుల మధ్య తమకు ఇష్టమైన విధంగా ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.