|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 09:02 PM
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మొత్తం వ్యవహారాన్ని కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమస్యగా అభివర్ణించారు. ఈ వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.కవిత చుట్టూ నెలకొన్న వివాదాలపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ, "ఇది పూర్తిగా డాడీ.. డాటర్, సిస్టర్.. బ్రదర్ మధ్య నడుస్తున్న సమస్య. వారి కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో, వాళ్లు ఆడుతున్న డ్రామాలో బీజేపీ భాగస్వామి కాదు, కాబోదు" అని తేల్చిచెప్పారు. ఈ అంశంపై బీజేపీ నాయకులు ఎవరూ స్పందించవద్దని కూడా ఆయన సూచించారు. తెలంగాణ ప్రజానీకానికి సైతం ఈ వివాదంతో ఎటువంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారంపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. "అసలు ఎవరు ఎవరితో చర్చలు జరిపారో బహిరంగంగా వెల్లడించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి నిరాధార ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.