|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:45 PM
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీవ్రమైన షాక్‌లో ఉన్నాయని, పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆయనపై కుట్రపూరితంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని జగ్గారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఈ దాడి ఘటనపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో బీజేపీ ఉందని ఆయన అన్నారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. "ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు ఎందుకు కొనసాగుతున్నాయి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?" అని జగ్గారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.