|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:13 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా ప్రభుత్వం విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు తాజాగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను యథాతథంగా కొనసాగించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు శ్రీజన, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్‌ను మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా నియమించింది.సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్‌లు ఉండగా, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్‌లు ఉంటాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్‌ల పరిధిలోని ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి.కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్‌లలో ఒక్కో కార్పొరేషన్‌లో సుమారు 35 లక్షల జనాభా ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 70 లక్షల జనాభా ఉంటుంది. తెలంగాణలోని ఏడు కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలలో ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న రోజున జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ జీవో జారీ చేయడం గమనార్హం.