|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:38 PM
ప్రభుత్వ పాఠశాలకు క్రీడామైదానాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది హైడ్రా. తమ పాఠశాల క్రీడామైదానం 33 గుంటల మేర ఉండగా.. వాహిద్ అనే వ్యక్తి ఆక్రమించి తన ఆధీనంలోకి తీసుకున్నారని ఆ పాఠశాల హెడ్ మాస్టర్ హైడ్రా ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు 24 గంటల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపారు హైడ్రా అధికారులు. సోమవారం హైడ్రా ప్రజావాణిలో ఈ మేరకు ఫిర్యాదు చేయగా.. మంగళవారం ఆక్రమణలను హైడ్రా తొలగించింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి, వెంకటేశ్వర నగర్ కాలనీలోని జడ్‌పీహెచ్ ఎస్ స్కూల్‌కి కేటాయించిన 33 గుంటల క్రీడామైదానాన్ని తిరిగి ఆ పాఠశాలకు చెందేలా హైడ్రా చర్యలు తీసుకుంది. క్రీడామైదానం వైపు ఇంటి ద్వారం పెట్టుకుని మొత్తం ఆక్రమించి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారనే ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. ఆక్రమలను తొలగించి పాఠశాలకు మాత్రమే వినియోగంలోకి వచ్చేలా హైడ్రా ఫెన్సింగ్ వేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు.. స్థానికులు హైడ్రా చర్యలను అభినందించారు. విద్యార్థలకు క్రీడామైదానం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో పరిష్కారం లభించడం హైడ్రాతోనే సాధ్యమని పలువురు పేర్కొన్నారు.