![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 10:27 PM
తెలంగాణలో రహదారుల అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని రహదారులతో పాటు పక్కనున్న పొరుగు రాష్ట్రాలను కలిపే హైవేలను కూడా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెండింగ్‌లో ఉన్న పలు నేషనల్ హైవేల గురించి కూడా కేంద్రంపై ఒత్తిడి పెడుతోంది. ఈ మేరకు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా కేంద్ర మంత్రులను కలుస్తూ విజ్ఞప్తులు చేస్తూ, లేఖలు సమర్పిస్తున్నారు మంత్రులు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు.. కేంద్రం కూడా తెలంగాణలోని పలు నేషనల్ హైవేలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే.. ఆలస్యమవుతున్న హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ పనులపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం తర్వాత.. మీడియా సమావేశం నిర్వహించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు కోమటిరెడ్డి తెలిపారు. అన్ని క్లియరెన్స్‌లు వచ్చిన తర్వాత.. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామని మాట ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.
మరోవైపు.. సంగారెడ్డి - భువనగిరి - చౌటుప్పల్ వరకు ఆర్‌ఆర్‌ఆర్ టెండర్ల పక్రియ పూర్తయిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. సుమారు 95 శాతం భూసేకరణ కూడా పూర్తనట్టు వెల్లడించారు. వెయ్యి కోట్ల రూపాయలతో 12 ఆర్వోబీలు కూడా మంజూరు చేసినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీ ఆదేశించినట్టు తెలిపారు.
వీటితో పాటు.. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టు పెండింగ్ పడుతూ వస్తున్న నేఫథ్యంలో.. నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు చేసినట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గుడిమల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఒక ప్యాకేజీ.. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీగా విభజించి.. టెండర్లు పిలవాలని అధికారులను నితిన్ గడ్కరీ ఆదేశించినట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియతో పనులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. 62 కిలో మీటర్ల మేర శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.