![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 08:22 PM
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో సిగరెట్ ఓ ఉపాధ్యాయుడి ప్రాణం తీసింది. మద్యం మత్తులో సిగరెట్ తాగి.. ఆర్పకుండా అలాగే పడుకోవటంతో మంచానికి మంటలు అంటుకొని ఉపాధ్యాయుడు సజీవదహనం అయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం మంగలి తండాకు చెందిన ధరావత్ బాలాజీ (52) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నడిగూడెం మండలం చెన్నకేశవాపురం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆయన భార్య శైలజ, ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. బాలాజీ ఒక్కడే ఉండడంతో ఆదివారం సాయంత్రం మద్యం తాగాడు. ఆ తర్వాత సిగరెట్ తాగుతూ ఆరుబయట మంచంపై పడుకున్నారు. మద్యం తాగిన మత్తులో నిద్రలోకి జారుకోవడంతో కాలుతున్న సిగరెట్ మంచం నవారుపై పడింది.
పక్కనే కూలర్ కూడా ఉండటంతో దాని గాలికి మంటలు వేగంగా వ్యాపించాయి. బాలాజీ మద్యం మత్తులో కదల్లేకుండా ఉండటం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవటంతో శరీరానికి మంటలు అంటుకుని అతడు అక్కడికక్కడే స్పాట్‌లోనే మృతిచెందారు. చాలా సేపటికి స్థానికులు గమనించి మంటల్ని ఆర్పేసినా.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. బాలాజీ భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.