![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 01:12 PM
నిర్మల్ జిల్లాలో ఒక రైతు గత పదేళ్లలో లక్షలాది రూపాయలు వెచ్చించి 30 బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని లోకేశ్వరం మండలం, రాజురా గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు మల్లన్నకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన తన పొలంలో వరి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసేవాడు. పంటలకు నీటి కోసం పలుమార్లు బోర్లు వేయించాడు.ఈ ఘటనపై ఎస్సై అశోక్ మాట్లాడుతూ, మల్లన్న 30 బోర్లు వేసినా ఒక్క దాంట్లోనూ నీరు పడలేదని తెలిపారు. గతంలో 27 బోర్లు వేసినా ఆయన ప్రయత్నాలు ఆపలేదని, ఈ సంవత్సరం మరో మూడు బోర్లు వేయించినా నీరు లభించలేదని చెప్పారు. బోర్ల కోసం చేసిన అప్పులు దాదాపుగా తీర్చేశాడని, ఇంకా రూ. 5 లక్షల వరకు అప్పు మిగిలి ఉందని పేర్కొన్నారు. మల్లన్నకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురికి వివాహం కాగా, కుమారుడు బ్యాంకు పరీక్షకు సిద్ధమవుతున్నాడు.