|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 08:01 PM
తెలంగాణలో నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కొత్త పథకమైన.. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు నేటి (ఏప్రిల్ 14న)తో ముగిసిపోతుండగా.. ఈ గడువును మరోసారి పెంచుతూ కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. దరఖాస్తు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్ 14న) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
సాంకేతిక సమస్యల కారణంగా పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ నేతలు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి గడువు పెంపుపై వినతిపత్రం సమర్పించారు. పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఏప్రిల్ 24వ తేదీ వరకు పొడిగించింది.
'రాజీవ్ యువ వికాసం' పథకం ద్వారా అర్హులైన 4,42,438 మంది లబ్ధిదారులకు రూ. 8,083.23 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పథకం కింద నిరుద్యోగులు రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందవచ్చు. విశేషం ఏమిటంటే.. ఈ రుణంలో 60 శాతం నుంచి 80 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. ఈ పథకాన్నిఆన్‌లైన్‌లో సింపుల్‌గా ఎలా అప్లయి చేసుకోవాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే నిరుద్యోగులు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
ఆధార్ కార్డు
రేషన్ కార్డు లేదా ఫుడ్ సెఫ్టీ కార్డు
మీసేవా ద్వారా పొందిన కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రం
పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ (వర్తిస్తే)
పట్టాదారు పాస్ బుక్ (వర్తిస్తే)
దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్
దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటో
లబ్ధిదారుడి గ్రూపునకు సంబంధించి మండల స్థాయి కమిటీ ధృవీకరించిన కాపీ (వర్తిస్తే)
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగ యువతకు ఒక గొప్ప అవకాశమని.. అర్హులైన వారందరూ ఈ పథకం యొక్క ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. పథకం గురించిన మరింత సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్‌ను లేదా స్థానిక అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు సమీపిస్తున్నందున అర్హులైన నిరుద్యోగులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది.