|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 08:06 PM
తెలంగాణలో రహదారుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ, రీజినల్ రింగు రోడ్డు వంటి ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం కూడా చేపడుతున్నారు. మంచిర్యాల-వరంగల్ మధ్య నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ పూర్తి అయింది. ప్రస్తుతం మంథని మండలంలో రహదారి నిర్మాణం పనులు జోరందుకున్నాయి. రూ.2,606 కోట్ల అంచనాతో ఈ పనులు జరుగుతున్నాయి. 2021 ఆగస్టులో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయగా.. భూసేకరణ దాదాపు పూర్తయింది. ప్రభుత్వం భూములను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పగించింది. మొత్తం 108 కిలోమీటర్ల రహదారిని మూడు భాగాలుగా విభజించి పనులు చేస్తున్నారు.
మొదటి భాగం జైపూర్ మండలం రసూల్‌పల్లి నుండి మంథని మండలం పుట్టపాక వరకు 31 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి రూ.873 కోట్లు కేటాయించారు. రెండవ భాగం పుట్టపాక నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పంగిడిపల్లి వరకు 38 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి రూ.881 కోట్లు కేటాయించారు. మూడవ భాగం భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి నుండి హనుమకొండ జిల్లా ఊరగొండ వరకు 39 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి రూ.851 కోట్లు కేటాయించారు. మంథని డివిజన్‌లో మొత్తం 204.46 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇప్పటివరకు 164.49 హెక్టార్లకు పరిహారం చెల్లించారు. కొన్ని కారణాల వల్ల 19.73 హెక్టార్లకు చెల్లింపులు జరగలేదు. 1,519 మంది నిర్వాసితుల్లో 1,303 మందికి రూ.47.13 కోట్లు చెల్లించారు.
ఇంకా 216 మందికి రూ.8.51 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూమి రికార్డులు సరిగా లేకపోవడం, వివాదాలు ఉండటం వల్ల పరిహారం చెల్లించడంలో ఆలస్యం జరుగుతోంది. పరిహారం సరిగా ఇవ్వలేదని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పరిహారం మొత్తాన్ని పెంచారు. రూ.51.17 కోట్లు మంజూరు చేయగా ఇప్పటివరకు రూ.46.12 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.5.04 కోట్లు చెల్లించాల్సి ఉంది. మంథని డివిజన్ పరిధిలోని 16 గ్రామాల్లో 505 ఎకరాల భూమి రహదారి కోసం తీసుకున్నారు. దీని కోసం 2021 ఆగస్టులో భూసేకరణ ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. సేకరించిన భూమిని ఎన్ హెచ్ఏఐకి ప్రభుత్వం అప్పగించింది.
ఈ రహదారి 45 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలుగా ఉంటుంది. ప్యాకేజీ-1లో భాగంగా చెట్టుపల్లి, నర్సింగాపూర్, నాగారంలలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. పోతారం వద్ద గోదావరి నదిపై వంతెన, పుట్టపాకలో జంక్షన్, ఓడేడ్ వద్ద మానేరు నదిపై వంతెన నిర్మిస్తారు. అలాగే డ్రైనేజీ నిర్మాణాలు కూడా చేస్తారు. రెండేళ్లలో జాతీయ రహదారి పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చెప్పారు. కాగా, ఈ రహదారి నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఊహించనందగా అభివృద్ధి జరగనుంది.