|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 01:04 PM
అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యం కోసం ట్రావెన్‌కూర్ దేవస్థానం బోర్డు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సీజన్‌లో గోల్డ్ లాకెట్లను జారీ చేసేలా చర్యలు చేపట్టింది. కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు విషు పర్వదినం సందర్భంగా స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి బొమ్మను ముద్రించిన లాకెట్లు... 2, 4, 8 గ్రాములలో లభిస్తాయి.శబరిమల గర్భగుడిలో అయ్యప్ప విగ్రహం ఉన్న బంగారు లాకెట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళానికి చెందిన మణిరత్నం అనే వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా మొదటగా కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో కేరళ దేవాదాయశాఖ మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారిలో ముందుగా మణిరత్నం ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు మెుదటి లాకెట్‌ను అందజేశారు. విషు రోజున సన్నిధానం వద్ద జెండా చెట్టు కింద బంగారు లాకెట్ల పంపిణీని ప్రారంభించారు. మణిరత్నం నాలుగు గ్రాముల లాకెట్‌ను రూ.38,600కు కొనుగోలు చేశారు. ఆలయ గర్భగుడిలో ఉంచి పూజించిన తొలి లాకెట్‌ను తమ కుమారుడు అందుకోవడం ఆనందంగా ఉందని జిల్లా వైద్యఆరోగ్యశాఖలో ఆరోగ్య విస్తరణాధికారిగా పని చేస్తున్న మణిరత్నం తండ్రి కొబగాపు నారాయణరావు తెలిపారు.